కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట.. | Sakshi
Sakshi News home page

కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట..

Published Sun, Jun 3 2018 4:36 PM

 Mukhtar Abbas Naqvi Says BJP May Look For New Allies  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరమేనని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ అంగీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవసరమైతే కొత్త మిత్రుల వైపు దృష్టిసారిస్తామన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహరి వాజ్‌పేయి హయాం నుంచే కూటమి భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రస్తావించారు. తాము సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉంటామని, అందుకే భాగస్వామ్య పక్షాలు తమతోనే ఉండాలని కోరుకుంటామన్నారు. కొత్త భాగస్వామ్య పార్టీల కోసం అన్వేషిస్తామని..కూటమిలో ఎవరికీ ప్రవేశం లేదనే బోర్డు పెట్టలేదని స్పష్టం చేశారు.

ఎన్‌డీఏ నుంచి ఇటీవల వైదొలిగిన పార్టీలు సైతం తిరిగి కూటమిలోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీ, మహారాస్ర్ట సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమిపై ఆయన స్పందిస్తూ ఉప ఎన్నికల్లో ఓటమి తమపై ప్రభావం చూపబోదని తాను చెబితే అది పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా పలు పార్టీల అపవిత్ర కలయికలను దీటుగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఫలితాలు తమకు ఉపకరిస్తాయని అన్నారు. యుద్ధరంగంలో ప్రత్యర్థుల వ్యూహాలు, ఎత్తుగడలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుత ఫలితాలు తమకు భవిష్యత్‌ వ్యూహాలు రూపొందించుకునే క్రమంలో ఉపయోగపడతాని వ్యాఖ్యానించారు. దేశంలో రైతాంగ సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనపై స్పందిస్తూ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement